Miryalaguda: విద్యుత్ ట్రూ-అప్ చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి!

Miryalaguda: విద్యుత్ ట్రూ-అప్ చార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపడాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత పరంగి రాము తీవ్రంగా ఖండించారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 17 Oct 2026 1:29 PM IST
Miryalaguda
X

Miryalaguda: విద్యుత్ ట్రూ-అప్ చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి!

Miryalaguda: విద్యుత్ వినియోగదారులపై ట్రూ-అప్ చార్జీల పేరుతో అదనపు భారం మోపాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పరంగి రాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లుల ద్వారా అదనపు వసూళ్లకు అనుమతినివ్వడాన్ని ఖండిస్తూ, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.

ట్రూ-అప్ పేరుతో మొత్తం రూ.7,635.22 కోట్ల వసూళ్లకు ప్రణాళిక రూపొందించగా, అందులో వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.5,420.23 కోట్లు వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 2026 నుంచి అదనపు చార్జీల వసూళ్లు ప్రారంభమవుతాయని, మొదటి నెలలో యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత నెలల్లో యూనిట్‌కు 50 పైసల చొప్పున వసూలు చేయనున్నారని తెలిపారు. దీంతో గృహ వినియోగదారులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు, పరిశ్రమలపై ఆర్థిక భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ బిల్లులపై అదనపు చార్జీలు విధించడం సమంజసం కాదన్నారు. విద్యుత్ రంగంలో ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపకుండా వినియోగదారులపై భారాలు మోపడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.

వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్ల భారాన్ని రైతుల నుంచి వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, మిగిలిన మొత్తాన్ని ఇతర కేటగిరీల వినియోగదారుల నుంచి వసూలు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు. ట్రూ-అప్ చార్జీలను సాధారణ విద్యుత్ బిల్లుల నుంచి వేరుగా చూపించాలనే ఆదేశం స్వాగతించదగినదేనని, అయితే చార్జీల లెక్కింపు విధానం, వర్తింపజేసిన రేట్లు, వసూలు చేసే మొత్తం తదితర వివరాలను బిల్లుల్లో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.

ప్రజలకు ముందుగానే పూర్తి వివరాలు వెల్లడించి, అదనపు వసూళ్లు ఎందుకు అవసరమో ప్రభుత్వం వివరించాలని పరంగి రాము డిమాండ్ చేశారు. ట్రూ-అప్ చార్జీలపై పునఃసమీక్ష నిర్వహించి సామాన్య వినియోగదారులపై పడే అదనపు భారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో TUCC జిల్లా కన్వీనర్ ఎం.డి. జలీల్ బాబా, AIYL జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉదయ్ కుమార్, నాగరాజు, AIAKS జిల్లా నాయకులు ప్రసాద్, నాగరాజు, కృష్ణయ్య, AISB జిల్లా అధ్యక్షులు నసీర్ బాబా, శ్రీను, ఆదినారాయణ, లక్ష్మయ్య, రవికుమార్, మురళి, AIAMS జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA