Devarakonda: బీఆర్ఎస్‌లో నలుగురి పోటీ.. అయోమయంలో పార్టీ క్యాడర్!
Devarakonda: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే టికెట్ కోసం నలుగురు నేతల మధ్య పోటాపోటీ పర్యటనలు చర్చనీయాంశమయ్యాయి.
Devarakonda: బీఆర్ఎస్‌లో నలుగురి పోటీ.. అయోమయంలో పార్టీ క్యాడర్!
Devarakonda: దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో రోజురోజుకూ రాజకీయ వేడి పెరుగుతోందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పటి నుంచే పార్టీలో చర్చనీయాంశంగా మారుతోందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
నియోజకవర్గంలో నలుగురు ముఖ్య నాయకులు ఎవరికి వారే తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే చర్చ సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, వడ్త్య రమేష్ నాయక్, నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ భీల్యా నాయక్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ముఖ్యంగా నియోజకవర్గంలో ఎక్కడ చావు జరిగినా, పెళ్లి జరిగినా, ప్రమాదం జరిగినా బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ తమ వంతుగా ఆర్థిక సహాయం అందించడం, కార్యకర్తలకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టికెట్ రేసులో ఎవరికి వారేనా?
ప్రతి చిన్న కార్యక్రమానికి హాజరవుతూ ప్రజలతో మమేకమవుతున్న ఈ నలుగురు నాయకుల రాజకీయ చురుకుదనం ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారనే చర్చ వినిపిస్తోంది.
ఒక నాయకుడి వెంట నడిస్తే మరొక నాయకుడికి దూరమైనట్లు అవుతుందేమోననే ఆందోళన కొందరు కార్యకర్తల్లో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.




