Suryapet: సూర్యాపేటలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ!

Suryapet: సూర్యాపేట జిల్లాలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ, వసతి, భోజనం అందించనున్నట్లు కలెక్టర్, ఎస్పీ తెలిపారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 30 Sept 2026 9:26 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ!

Suryapet: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు పోలీస్ రిక్రూట్ మెంట్ లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు వీలుగా ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె.నరసింహ సంయుక్తంగా తెలిపారు.

ఈ మేరకు ప్రత్యేక ప్రిలిమ్స్ క్రాష్ కోర్సు, ఉచిత శారీరక సామర్థ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పూర్తి ఉచితంగా వసతి, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించనున్నారు. రాత పరీక్షల కోసం అనుభవజ్ఞులైన అధ్యాపకులతో సమగ్ర సిలబస్ పై ప్రత్యేక తరగతులు, అలాగే పోలీస్ గ్రౌండ్ లో నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో ప్రతిరోజూ ఫిజికల్ ఈవెంట్స్ లో సాధన చేయించనున్నారు.

నేటి నుంచి సూర్యాపేట జిల్లా వాసులు ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి గూగుల్ ఫారం ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు https://suryapet.telangana.gov.in వెబ్ సైట్ లో ఉన్న గూగుల్ ఫారం లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక, శిక్షణకు సంబంధించిన తదుపరి వివరాలను సంబంధిత అధికారులు తెలియజేస్తారని, జిల్లాలోని అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, ఎస్పీ పిలుపునిచ్చారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA