Thirumalagiri: దివ్యాంగులు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి!
Thirumalagiri: తిరుమలగిరిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కాంగ్రెస్ వైఫల్యాలపై ధ్వజం దివ్యాంగులకు రూ.6,000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్.
Thirumalagiri: దివ్యాంగులు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి!
Thirumalagiri: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో దివ్యాంగులు, వృద్ధులు, మహిళలతో సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దివ్యాంగుల పింఛన్ రూ.500 మాత్రమే ఉండేదని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని దశలవారీగా రూ.4,000కు పెంచారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పింఛన్ల కోసం సుమారు రూ.10,300 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
గతంలో దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా 100 శాతం సబ్సిడీతో త్రిచక్ర వాహనాలు, స్మార్ట్‌ఫోన్లు తదితర ఉపకరణాలు అందించామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి ఉద్యోగులను తొలగించిందని ఆరోపించారు.
ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేసిన కొన్ని వాహనాలకు సర్టిఫికెట్లు లేకపోవడంతో ఆర్‌టీఓ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోపించారు. దీంతో ఇన్సూరెన్స్ పొందలేక ప్రమాదాల సమయంలో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా, అధికారులను కలిసినా స్పందన లేదని విమర్శించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు, బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ, నెలకు రూ.6000 పింఛన్ వంటి హామీలు ఇచ్చారని, వాటి అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అలాగే 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామన్న మహాలక్ష్మి హామీని కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దివ్యాంగుల పింఛన్‌ను రూ.6,000కు పెంచాలని, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, స్మార్ట్‌ఫోన్లు, వినికిడి పరికరాలు, వాహనాలు వంటి సహాయక ఉపకరణాలను అర్హులైన వారికి నిబంధనల ప్రకారం అందించాలని కోరారు.
దివ్యాంగులు శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంకల్పబలంతో ముందుకు సాగుతున్నారని, పురాణాల్లో అరుణుడి రథసారథ్యాన్ని, శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితాన్ని ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణం, భారీ భూకేటాయింపులకు నిధులు కేటాయించే ప్రభుత్వానికి దివ్యాంగుల పింఛన్లు, ఉద్యోగుల ప్రయోజనాల కోసం నిధులు లేవని చెప్పడం సరికాదని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, దివ్యాంగులు సహా వివిధ వర్గాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని అన్నారు.
జీవో 97 వల్ల పాఠశాలలకు ఎదురవుతున్న సమస్యలు, నిరుద్యోగ సమస్య, మూసీ ప్రక్షాళన పేరుతో ఇళ్ల తొలగింపు వంటి అంశాలపైనా ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ప్రజల తరఫున మరింత పెద్దఎత్తున పోరాటాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.




