Suryapet: కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కిశోర్
Suryapet: తుంగతుర్తిలో కాంగ్రెస్ దాడులపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్. గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తకు పరామర్శ, పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక.
Suryapet: కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కిశోర్
Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త గునిగంటి చంద్రకాంత్‌ను ఆయన పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో దౌర్భాగ్యమైన పరిస్థితులు నెలకొన్నాయని, కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో స్థానిక సీఐ, ఎస్ఐలు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, వారి తీరును ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.గడిచిన పదేళ్లలో తుంగతుర్తిలో ప్రశాంత వాతావరణం ఉండేలా కృషి చేశామని, ఇప్పుడు మళ్లీ దాడులు, కక్షలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఓపిక నశిస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయని, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసులను, కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన అబద్ధాలకు బాండ్ అంబాసిడర్‌లా మారామని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పై నాయకత్వం ఎట్లుందో కింది నాయకత్వం కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, వారి కుటుంబాలకు పార్టీ, కేసీఆర్ ఎప్పుడూ అండగా ఉంటారని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.




