Suryapet: చిట్టీల పేరుతో రూ.6 కోట్ల టెకనామరి.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్!
Suryapet: చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో రూ.6 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బానోత్ రాజు, ఆయన భార్య అనూష అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ.
Suryapet: చిట్టీల పేరుతో రూ.6 కోట్ల టెకనామరి.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్!
Suryapet: చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు, అధిక రాబడి పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ఇద్దరిని చివ్వెంల పోలీసులు అరెస్ట్ చేశారు.
సూర్యాపేట డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ జి. రాజశేఖర్, చివ్వెంల ఎస్ఐ వి. మహేష్ పాల్గొన్నారు.
చివ్వెంల మండలం యెనగండి తండాకు చెందిన బానోత్ రాజు (44), ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తన భార్య బానోతు అనూష (33) సహకారంతో 2015 నుంచి చిట్టీల వ్యాపారం, డెయిలీ కలెక్షన్లు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. అధిక రాబడులు, నెలవారీ చెల్లింపులు ఇస్తామని నమ్మించి ప్రజలు, తోటి ఉద్యోగులు, పరిచయస్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించారని, భూములు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి కూడా నగదు తీసుకున్నారని, చిట్టీల గడువు పూర్తైనా డబ్బులు తిరిగి చెల్లించకుండా మోసం చేశారని పేర్కొన్నారు.
సేకరించిన మొత్తంలో కొంత భాగాన్ని వ్యక్తిగత అవసరాలు, ఆస్తుల కొనుగోలుకు వినియోగించగా, మిగిలిన మొత్తాన్ని సుమారు 500-600 మందికి రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు నెలకు 10 శాతం వరకు అధిక వడ్డీకి అప్పుగా ఇచ్చినట్లు గుర్తించామన్నారు.
ఆర్థిక వివరాలు:
- బాధితుల నుంచి సేకరించిన మొత్తం: రూ.6,24,50,000/-
- తిరిగి చెల్లించిన మొత్తం: రూ.3,18,54,000/-
- ఇంకా చెల్లించాల్సిన బకాయి: రూ.3,05,96,000/-
నిందితుల నుంచి స్వీకరించిన మొత్తాలు, తిరిగి చెల్లింపులు, ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్లు, భూముల లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
అరెస్ట్ అయిన నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దంపతుల చేతిలో మోసపోయిన ఇతర బాధితులు ఎవరైనా ఉంటే ఆధారాలతో చివ్వెంల పోలీసులను సంప్రదించాలని కోరారు. అధిక రాబడుల పేరుతో ప్రజలను మోసగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




