Suryapet: ఘనంగా ప్రారంభమైన టేకుమట్ల చౌడమ్మ లింగమంతుల జాతర

Suryapet: సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామంలో ఘనంగా ప్రారంభమైన చౌడమ్మ తల్లి - లింగమంతుల స్వామి జాతర.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 15 Jun 2026 11:59 AM IST
Suryapet
X

Suryapet: ఘనంగా ప్రారంభమైన టేకుమట్ల చౌడమ్మ లింగమంతుల జాతర

సూర్యాపేట: యాదవుల కొంగు బంగారంగా పేరొందిన సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ శ్రీశ్రీశ్రీ చౌడమ్మ తల్లి - లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే ఈ మహోత్సవం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ద్వాపర యుగంలో వెలసినట్లు చెప్పుకునే టేకుమట్ల గ్రామ దేవతల కళ్యాణ మహోత్సవం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ఆధ్యాత్మిక శోభను నింపింది. ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదర్శనలతో జాతరకు శ్రీకారం చుట్టారు. డిజె శబ్దాలు, మందగంపల ఊరేగింపులు, సంప్రదాయ ఆటపాటల మధ్య గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

సోమవారం ఉదయం దేవరపెట్టె వద్ద లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి కళ్యాణం వేద మంత్రాల మధ్య ఘనంగా జరిపించారు. యాదవుల కులదైవంగా ఆరాధించబడే అమ్మవార్లకు భక్తులు బోనాలు, మైదా బోనం, సన్నవసరం బోనం, నవధాన్యాలు, చీరలు సమర్పించారు.

సూర్యాపేట నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి, కోదాడ, మునగాల తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా యాదవులు తరలివచ్చారు. సంతానం లేని వారు సంతానం కోసం, మొక్కులున్న వారు మొక్కులు చెల్లించేందుకు దేవస్థానం వద్ద బారులు తీరారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా ఈ జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చౌడమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. జాతరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ మెంబర్లు జాలా నరసయ్య బొర్రాజు వెంకన్న గుండబోయిన జానకి రాములు జాల సైదులు బోర్రాజు జానయ్య జాల జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story