Huzurnagar: హుజూర్ నగర్లో రూ.545 కోట్ల సీలింగ్ భూమి కుంభకోణం!
Huzurnagar: హుజూర్నగర్లో రూ.545 కోట్ల విలువైన సీలింగ్ భూమి అక్రమ బదిలీపై ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆర్డీవోను కలెక్టర్ తేజస్ ఆదేశించారు.
Huzurnagar: హుజూర్ నగర్లో రూ.545 కోట్ల సీలింగ్ భూమి కుంభకోణం!
హుజూర్ నగర్: హుజూర్ నగర్ లో సుమారు 545 కోట్ల రూపాయల విలువైన సీలింగ్ భూమిని బంధువుల పేర్లతో బినామీలకు అక్రమంగా బదిలీ చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ఊట్కూరు శ్రీరామచంద్రమూర్తి సోమవారం సూర్యాపేట జిల్లా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు ఫిర్యాదు అందజేశారు.
ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కలెక్టర్, మూడు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని హుజూర్ నగర్ ఆర్డీవోను ఆదేశించారు. ఇరుపక్షాలకు హియరింగ్ షెడ్యూల్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఫిర్యాదులోని అంశాలు:
హుజూర్ నగర్ కు చెందిన కల్వకొలను వెంకట సత్యనారాయణ వరప్రసాద్, కల్వకొలను వెంకట సుధాకర్ శాస్త్రి కుటుంబీకులు భూ సంస్కరణ చట్టం 1973 ను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీ నెంబర్ 3963/1975 లో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి, 1971 నుండి 1975 మధ్య గిఫ్ట్ సెటిల్మెంట్ పేరుతో మైనర్లతో సహా బంధువుల పేర్లపై భూములను లోపాయికారీగా బదిలీ చేశారని ఆరోపించారు. సీలింగ్ చట్టం సెక్షన్ 7 ప్రకారం ఈ బదిలీలు చెల్లవని, రద్దు చేయాలని కోరారు.
ప్రభుత్వ పరం చేయాల్సిన సర్వే నెంబర్లు 263, 928, 806, 112 తదితరాలలోని 12 ఎకరాల 25 గుంటల సీలింగ్ భూమిని రెవెన్యూ రికార్డులలో నమోదు చేయకుండా అమ్ముకున్నారని, శాశ్వత రక్షిత కౌలుదారులకు 38 ఈ సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఫిర్యాదుదారు తెలిపారు.
నాగార్జున సాగర్ కాలువల కింద పోయిందని, బలహీన వర్గాల గుడిసెలు ఉన్నాయని చూపి, ఆ గుడిసెలను తొలగించి ప్లాట్లుగా మార్చి విక్రయించారని, కొమ్ముబట్ల సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, అమరవాది లక్ష్మీనరసయ్య తదితర బంధువుల పేర్లపై 50 ఎకరాలకు పైగా అక్రమ బదిలీ జరిగిందని ఆరోపించారు.
మొత్తం 151 ఎకరాల భూమి (ఎకరం రూ.3 కోట్ల చొప్పున రూ.450 కోట్లు), 6000 చ.గజాల స్థలం (రూ.90 కోట్లు) కలిపి సుమారు రూ.545 కోట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమిలేని వ్యవసాయ కూలీలకు, ఇళ్లు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని, అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి చీటింగ్, కబ్జా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు.




