Huzurnagar: హుజూర్‌నగర్‌లో భారీ భూ దందా: ఎన్‌ఎస్‌పీ కాలువ భూమి విక్రయం!

Huzurnagar: హుజూర్‌నగర్‌లో నాగార్జున సాగర్ కాలువ ప్రభుత్వ భూమిని తప్పుడు రికార్డులతో ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసి కోట్లు కాజేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 11 Nov 2026 10:10 PM IST
Huzurnagar
X

Huzurnagar: హుజూర్‌నగర్‌లో భారీ భూ దందా: ఎన్‌ఎస్‌పీ కాలువ భూమి విక్రయం!

హుజూర్ నగర్‌: హుజూర్ నగర్‌లో భారీ భూ మోసం వెలుగులోకి వచ్చింది. దశాబ్దాల క్రితమే ప్రభుత్వం సేకరించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువ భూములను, ఓ ముఠా గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసేసింది. రెవెన్యూ రికార్డుల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలు కాజేసిన ఈ కేటుగాళ్ల గుట్టును హుజూర్ నగర్ పోలీసులు రట్టు చేశారు.

దీనికి సంబంధించి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 458 లో ఉన్న 9 ఎకరాల 16 గుంటల భూమిని 1971లోనే ప్రభుత్వం NSP కాలువల కోసం సేకరించింది. యజమాని భువనగిరి వెంకటనర్సయ్యకు అప్పట్లోనే పరిహారం కూడా చెల్లించింది. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమిని కాలువ భూమిగా నమోదు చేయకపోవడంతో, ఆయన మరణానంతరం కుమార్తె సామ్రాజ్యం పేరు మీద పట్టా పాస్‌బుక్ వచ్చింది.

వృద్ధాప్యం, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సామ్రాజ్యం తన భూమి వివరాలు చూడమని పక్కింటి వ్యక్తి పసుపులేటి రామారావును కోరింది. ఆ భూమి ప్రభుత్వ సేకరణలో ఉందని తెలిసినా, రామారావు మరో నలుగురితో కలిసి భారీ స్కెచ్ వేశాడు. ఎకరాకు కోటి రెండు లక్షల చొప్పున నకిలీ అగ్రిమెంట్ సృష్టించి, హైదరాబాద్‌కు చెందిన కళ్యాణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ వద్ద రూ. 1.30 కోట్ల ఫైనాన్స్‌కు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆగస్టు 6న తహశీల్దార్ కార్యాలయంలో తప్పుడు హామీ పత్రం సమర్పించి, ఆ భూమిని ఫైనాన్షియర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఫైనాన్షియర్ ఇచ్చిన కోటి 7 లక్షల రూపాయల చెక్కును సామ్రాజ్యం ఖాతాలో వేసి, నిందితులంతా కలిసి ఆ డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. సామ్రాజ్యానికి మాత్రం కేవలం లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన హుజూర్ నగర్ ఎస్ఐ చలిగంటి నరేష్ దర్యాప్తు చేపట్టారు. సామ్రాజ్యానికి నోటీసులు జారీ చేసి, ప్రధాన నిందితులు పసుపులేటి రామారావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, కన్నె కొండలరావు, బేత వెంకటరెడ్డి, శేషం రవిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR