Suryapet: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు నిరసన ప్రైవేట్ పాఠశాలల బంద్!
Suryapet: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ హుజూర్‌నగర్‌లో ప్రైవేట్ పాఠశాలల బంద్, ఉపాధ్యాయుల నిరసన. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని ట్రస్మా డిమాండ్.
Suryapet: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు నిరసన ప్రైవేట్ పాఠశాలల బంద్!
Suryapet: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో పదో తరగతి విద్యార్థుల చేతిలో ప్రిన్సిపాల్ శ్రీమతి రూపారెడ్డి హత్యకు గురైన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) పిలుపు మేరకు హుజూర్‌నగర్ పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించాయి.
ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌లోని వివిధ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు బంద్‌లో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఇందిరా చౌక్ వద్దకు చేరుకుని ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి మండల ప్రైవేట్ పాఠశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కాకి శ్రీధర్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు, విద్యా సంస్థల సిబ్బందిపై దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించేలా తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ప్రిన్సిపాల్ రూపారెడ్డి కుటుంబానికి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో హుజూర్‌నగర్‌లోని వివిధ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




