Kodad: కోదాడలో సారా కలకలం.. 200 కిలోల స్పటికలు పట్టివేత!
Kodad: సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ కార్గోలో 200 కిలోల సారా తయారీ స్పటికల పట్టివేత. రాజమండ్రి నుంచి అక్రమ రవాణా.
Kodad: కోదాడలో సారా కలకలం.. 200 కిలోల స్పటికలు పట్టివేత!
సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలో నిన్న రాత్రి భారీ ఎత్తున సారా తయారీ పదార్థాలు పట్టుబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని కార్గో (పార్సిల్) కార్యాలయంలో దాదాపు 200 కిలోల సారా తయారీ స్పటికను అధికారులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి) నుంచి కోదాడ కార్గో కేంద్రానికి కొన్ని భారీ బస్తాల పార్సిల్స్ వచ్చాయి. అయితే, సరుకు డెలివరీ తీసుకునేందుకు ఎవరూ రాకపోవడం,ఆ బస్తాల నుంచి ఒక రకమైన ఘాటైన వాసన వస్తుండటంతో కార్గో సిబ్బందికి అనుమానం వచ్చింది. పార్సిల్ బరువు,రశీదులను నిశితంగా పరిశీలించిన అధికారులు వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు మరియు నిఘా విభాగం అధికారులు తక్షణమే కోదాడ కార్గో కేంద్రానికి చేరుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న సరుకును తెరిచి చూడగా, అందులో సారా తయారీకి వినియోగించే సుమారు 200 కిలోల స్పటిక (ఆలమ్) లభ్యమైంది. దీంతో అధికారులు ఆ సరుకును స్వాధీనం చేసుకున్నారు.
ఈ భారీ మొత్తంలో స్పటికను రాజమహేంద్రవరం నుంచి ఎవరు బుక్ చేశారు? కోదాడ పరిసర ప్రాంతాల్లో దీనిని ఎవరు స్వీకరించాల్సి ఉందనే కోణంలో నిఘా అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. పార్సిల్ బుకింగ్ రశీదులపై ఉన్న ఫోన్ నంబర్లు, చిరునామాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.




