Suryapet: మితిమీరిన మట్టి మాఫియా ఆగడాలు చెరువులో అక్రమ తవ్వకాలు!
Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు. యథేచ్ఛగా మట్టి మాఫియా దందాతో భయాందోళనలో గ్రామస్థులు, పశుపోషకులు.
Suryapet: మితిమీరిన మట్టి మాఫియా ఆగడాలు చెరువులో అక్రమ తవ్వకాలు!
Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, తుంగతుర్తి మండలం పరిధిలోని తూర్పు గూడెం గ్రామంలో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా స్థానిక చెరువులో మట్టి దళారులు భారీ యంత్రాలతో ప్రమాదకరమైన లోతైన గుంతలు తవ్వుతూ అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.
ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు అక్రమ తవ్వకాల వల్ల చెరువులో ఏర్పడుతున్న లోతైన గోతులు వర్షపు నీటితో నిండిపోతున్నాయి. గ్రామానికి చెందిన పశువులు, గొర్రెలు, మేకలు మేత కోసం చెరువు పరిసరాల్లోకి వెళ్లినప్పుడు ఆ గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పశుపోషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు లేదా చిన్న పిల్లలు చెరువులోకి దిగితే ప్రమాదవశాత్తూ లోతైన గుంతల్లో పడి మునిగిపోయే అవకాశం ఉందని, ఇది తీవ్ర ప్రాణనష్టానికి దారితీస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల వత్తాసుపై తీవ్ర విమర్శలు ఈ అక్రమ తవ్వకాలపై ఇరిగేషన్ శాఖ ఏఈ (AE), డీఈ (DE) లను వివరణ అడగగా తమ వద్ద నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెబుతున్నారు. నిన్ననే తవ్వకాలను ఆపేశామని అధికారులు నిరభ్యంతరంగా చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం మట్టి దళారులు అధికారులతో చేతులు కలిపి నేటికీ యదేచ్ఛగా దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. కళ్లెదుటే అక్రమంగా మట్టి తరలిపోతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, మట్టి మాఫియాకు సపోర్టుగా నిలుస్తున్నారని గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
కఠిన చర్యలకు డిమాండ్ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే పూర్తిగా నిలిపివేసి, గ్రామానికి మరియు పశువులకు రక్షణ కల్పించాలని తూర్పు గూడెం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మట్టి మాఫియా దళారులతో పాటు, వారికి పరోక్షంగా సహకరిస్తున్న ఇరిగేషన్ అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




