Suryapet: పిన్నాయిపాలెం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ!

Suryapet: సూర్యాపేట మండల పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 7 Nov 2026 10:37 AM IST
Suryapet
X

Suryapet: పిన్నాయిపాలెం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ!

Suryapet: సూర్యాపేట మండలంలోని పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య పంపిణీ చేశారు.

సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్ లో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడారు.

సూర్యాపేట నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేసుకునేందుకు ప్రతి వారం బిల్లులు చెల్లిస్తూ, అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు.

మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి వారికి ప్రతి నెల ఆదాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మైక్రో ఇండస్ట్రియల్ పార్కులు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

మహిళా సంఘాల నుంచి ఇప్పటికే 150 బస్సులను ఆర్టీసీకి లీజుకు ఇచ్చి లక్షల్లో ఆదాయం పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడాదిలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించామని, రూ.21,600 కోట్ల వడ్డీలేని రుణాలను మహిళలకు అందిస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.200 కోట్ల పెట్టుబడితో 104 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిన్నాయిపాలెం గ్రామ సర్పంచ్ చింత భవాని మధుసూదన్, ఉప సర్పంచ్ లింగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు జెర్రిపోతుల సైదులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA