Kodad: కోదాడలో ఈ నెల 19న మెగా జాబ్ మేళా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Kodad: కోదాడలోని సి.సి. రెడ్డి పాఠశాలలో సెప్టెంబర్ 19న 250 ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Kodad: కోదాడలో ఈ నెల 19న మెగా జాబ్ మేళా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట: ఈ నెల 19వ తేదీన కోదాడలోని సి.సి. రెడ్డి పాఠశాలలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఆదివారం అధికారులతో వెబెక్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ తో పాటు ఇతర ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళాకు అర్హులని స్పష్టం చేశారు. దాదాపు 250కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని తెలిపారు.
అభ్యర్థులు http://kodadmegajobmela.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నమోదు పూర్తయిన తర్వాత ప్రతి అభ్యర్థికి ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో కూడిన అక్నాలెడ్జ్‌మెంట్ వస్తుందని, ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 5 కంపెనీల ఇంటర్వ్యూలకు ఎంపిక చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
జాబ్ మేళా రోజున అభ్యర్థులు తమ అక్నాలెడ్జ్‌మెంట్ ప్రింటౌట్‌తో పాటు 5 సెట్ల బయోడేటాను తప్పనిసరిగా తీసుకురావాలని, 19వ తేదీ ఉదయం 8:00 గంటల నుంచే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
గ్రామ స్థాయిలో టామ్ టామ్ వేయించాలని, సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. అలాగే సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ పరిధిలోని జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులు అధిక సంఖ్యలో నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఎస్పీ నరసింహ, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, పలు కంపెనీల సీఈఓలు, ఎండీలు పాల్గొన్నారు.




