Kodad: డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు.. 6 కిలోల గంజాయి, మత్తు సిరప్‌లు స్వాధీనం!
Kodad: కోదాడలో 6 కిలోల గంజాయి, 38 మత్తు సిరప్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, ప్రధాన నిందితుడు రవితేజతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.
Kodad: డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు.. 6 కిలోల గంజాయి, మత్తు సిరప్‌లు స్వాధీనం!
కోదాడ hmtv : పట్టణంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడిన గంజాయి, దగ్గు మందు సిరప్ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
పోలీసుల తెలిపిన వివరాల మేరకు ఆగస్ట్ 2వ తేదీ సాయంత్రం కోదాడ పట్టణంలోని శ్రీరంగపురం డేగ బాబు ఫంక్షన్ హాల్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ దాడుల్లో 6 కిలోల గంజాయి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కోసం అక్రమంగా విక్రయిస్తున్న 38 దగ్గు మందు సిరప్ బాటిళ్లు, ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని డీఎస్పి వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి కోదాడ పట్టణంలో విక్రయిస్తున్న ప్రధాన నిందితుడు అల్వాలపురం గ్రామానికి చెందిన మద్దె రవితేజతో పాటు మరో ఆరుగురు నిందితులు, ముగ్గురు బాల నేరస్తులను పోలీసులు గుర్తించారు. ఓక మెడికల్ షాప్‌లో ఎలాంటి వైద్యుల సిఫారసు (ప్రిస్క్రిప్షన్) లేకుండా, ఎమ్మార్పీ కంటే అధిక ధరకు కోడీన్ కలిగిన టాసెక్స్ సిరప్‌ను మత్తు కోసం అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
పట్టుబడిన నిందితులందరినీ న్యాయస్థానానికి తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కోదాడను పూర్తిగా డ్రగ్ ఫ్రీ సొసైటీ గా మార్చే లక్ష్యంతో ఇలాంటి తనిఖీలు, నిఘా మరింత ముమ్మరం చేస్తామని, మాదకద్రవ్యాల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.




