Kodad: కోదాడలో కార్డన్ అండ్ సెర్చ్.. 25 బైకులు స్వాధీనం
Kodad: సూర్యాపేట జిల్లా కోదాడ బాలాజీ నగర్‌లో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. సరైన పత్రాలు లేని 25 బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Kodad: కోదాడలో కార్డన్ అండ్ సెర్చ్.. 25 బైకులు స్వాధీనం
కోదాడ: నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే ధ్యేయంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్‌లో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 మోటార్ సైకిళ్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్సైలతో పాటు 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజం నుండి గంజాయి మహమ్మారిని పూర్తిగా తరిమివేసి, యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలు కష్టార్జితాన్ని వృథా చేసుకోకుండా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించారు. పట్టణంలో ఇళ్ల యజమానులు కొత్తవారికి, గుర్తింపు కార్డులు లేని వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రయాణాల్లో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు, జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ కోరారు. చట్ట వ్యతిరేక పనులకు, నేరాలకు పాల్పడితే ఎంతటి వారికైనా శిక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు గొడవలకు దూరంగా ఉంటూ చట్టానికి లోబడి నడుచుకోవాలన్నారు.
పట్టణంలో ఎక్కడైనా అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100, డయల్ 112 లేదా సైబర్ నేరాల కోసం 1930 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




