suryapet: మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌కు భూమి కేటాయించండి.. సీఎంకు సీపీఎం విన్నపం

suryapet: తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ సేవా కార్యక్రమాల కోసం 2 ఎకరాల భూమి కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన సీపీఎం ప్రతినిధి బృందం.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 26 May 2026 8:50 PM IST
suryapet
X

suryapet: మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌కు భూమి కేటాయించండి.. సీఎంకు సీపీఎం విన్నపం

సూర్యాపేట: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళా ఉద్యమ నాయకురాలు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ సేవా కార్యక్రమాల కొనసాగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల భూమి కేటాయించాలని సీపీఎం నేతలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎంను కలిసింది. హైదరాబాద్ ఎల్బీనగర్, హయత్‌నగర్ లేదా సూర్యాపేట జిల్లా కేంద్రంలో భూమి కేటాయించాలని కోరారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, 2022 మార్చి 19న మరణించిన మల్లు స్వరాజ్యం నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారని, తుంగతుర్తి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కృషి చేశారని గుర్తు చేశారు. మహిళల ఆస్తి హక్కు చట్టాల రూపకల్పనలో ఆమె సలహాలు కీలకమైనవని తెలిపారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికలు, మహిళలకు ఉచిత కరాటే శిక్షణ, కౌన్సెలింగ్, లీగల్ ఎయిడ్, స్టార్ట్ స్టే హోమ్, స్టడీ సర్కిల్స్, కంప్యూటర్ శిక్షణ, స్వయం వృత్తి శిక్షణ వంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. వాటి విస్తరణకు ప్రభుత్వ సహకారం అవసరమని కోరారు. వినతి పత్రాన్ని స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి, ట్రస్ట్ సేవల కొనసాగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, పోతినేని సుదర్శన్, నున్న నాగేశ్వరావు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story