Miryalaguda: హోటల్‌లో బిర్యానీ తిని వ్యక్తికి అస్వస్థత.. ఆహార నాణ్యతపై ఆందోళన!

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కృష్ణపట్నం హోటల్‌లో బిర్యానీ తిన్న హర్షద్ అనే వ్యక్తి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 29 Nov 2026 7:48 AM IST
Miryalaguda
X

Miryalaguda: హోటల్‌లో బిర్యానీ తిని వ్యక్తికి అస్వస్థత.. ఆహార నాణ్యతపై ఆందోళన!

Miryalaguda: బయట అద్దాల మెరుపులు.. లోపల ఆహార నాణ్యతపై అనుమానాలు! కస్టమర్లకు రుచికరమైన భోజనం అందించాల్సిన హోటల్‌లో నిల్వ చేసిన ఆహారాన్ని వడ్డిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నార్కట్‌పల్లి–అద్దంకి బైపాస్ రోడ్డులో ఉన్న కృష్ణపట్నం హోటల్‌లో బిర్యానీ తిన్న హర్షద్ అనే వ్యక్తి వాంతులతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఇక్కడితో ఆగడం లేదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు పలుమార్లు జరిగాయని, బాధితులతో హోటల్ యాజమాన్యం లోపలే సెటిల్ చేసుకుందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఏమిటన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.

మిగిలిపోయిన చికెన్, బిర్యానీని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి మరుసటి రోజు ఆహారంలో కలిపి వడ్డిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

అసలు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు?

పట్టణంలో హోటళ్లు నిర్వహిస్తున్న తీరుపై పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత అధికారులదే కాదా? ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదు?

కృష్ణపట్నం హోటల్‌పై తనిఖీలు ఎందుకు జరగడం లేదు? హోటల్ యాజమాన్యానికి, సంబంధిత అధికారులకు మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అధికారుల మౌనం వెనుక ఏదైనా కారణం ఉందా? ఫుడ్ సేఫ్టీ అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నాయా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. సంబంధిత అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఒకవైపు సామాన్య ప్రజలు డబ్బులు చెల్లించి ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతుంటే.. మరోవైపు తనిఖీలు చేయాల్సిన అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సామాన్యుడికి దిక్కెవరు?

వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణపట్నం హోటల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. వంటగది, ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించాలి. నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాలి. గతంలో వచ్చిన ఫిర్యాదులపై కూడా విచారణ జరపాలి.

ఆరోపణలు నిజమని తేలితే హోటల్ యాజమాన్యంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. హోటల్ యాజమాన్యం పై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాలి.. ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి!

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA