Suryapet: నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్!
Suryapet: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం మాస్ ప్లాంటేషన్ కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు.
Suryapet: నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్!
సూర్యాపేట: ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవంలో భాగంగా ఈ నెల 25 నుండి జిల్లా వ్యాప్తంగా సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వనమహోత్సవంపై జిల్లా కలెక్టర్లు, అటవీ, దేవాదాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలోని నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలను వార్డులు, గ్రామాల వారీగా నాటేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
ఒక్కొక్క మండలంలో 10 వేలకు తక్కువ కాకుండా మొక్కలు నాటించాలని, అన్ని మండలాల్లో 150 మందికి తక్కువ కాకుండా లేబర్ మొబలైజేషన్ చేయాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలలు, ఇన్స్టిట్యూషన్స్, అటవీ ప్రాంతంలో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం అత్యంత ముఖ్యమని, నాటిన ప్రతి మొక్క బతికేలా అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
అంతకుముందు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. అటవీ కవరేజీని పెంచేలా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, మున్సిపల్ చైర్మన్లను భాగస్వాములను చేయాలన్నారు.
నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి టీజీ ఫారెస్ట్ పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేయాలని, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు నాటాలని, ప్రతి ఇంటికి రెండు మొక్కలు అందించేలా చర్యలు చేపట్టాలని, దేవాలయాల్లో ప్రత్యేకమైన మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో శిరీష, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సన్యాసయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




