Suryapet: అమరుల ఆశయాలకు ప్రజా సంక్షేమ పాలనే నిజమైన నివాళి: మంత్రి ఉత్తమ్!
Suryapet: సూర్యాపేటలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ. సాగునీరు, సంక్షేమ పథకాల అమలు ప్రగతిపై సమగ్ర వివరాల వెల్లడి.
Suryapet: అమరుల ఆశయాలకు ప్రజా సంక్షేమ పాలనే నిజమైన నివాళి: మంత్రి ఉత్తమ్!
సూర్యాపేట: రాచరికపు సంకెళ్లను తెంచిన పోరాట యోధుల త్యాగాలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచి అని, అమరుల ఆశయాలను ప్రజా సంక్షేమ పాలనగా మలచడమే వారికి నిజమైన నివాళి అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు, తెలంగాణ అమరులకు నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో చారిత్రక మలుపు అని, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమై 78 ఏళ్లు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందని తెలిపారు. రజాకార్ల దౌర్జన్యాలకు ఎదురొడ్డి తెలంగాణ ప్రజలు చేసిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని మంత్రి చెప్పారు.
జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రి వెల్లడించిన వివరాలు:
సాగునీటి రంగం: జిల్లాలో రూ.2,889.66 కోట్ల వ్యయంతో 1,39,837 ఎకరాలకు ప్రయోజనం చేకూరేలా పలు ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కు రూ.1,649 కోట్లు, జాన్ పహాడ్ కు రూ.292.08 కోట్లు, రాజీవ్ గాంధీ ఎత్తిపోతలకు రూ.452.40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
సంక్షేమం: మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో మహిళలు 5.81 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేసి రూ.355.03 కోట్లు ఆదా చేసుకున్నారని, రూ.500 గ్యాస్ సిలిండర్ కింద 4.05 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు.
రైతు సంక్షేమం: వానాకాలం-2026 లో 2.90 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.364.08 కోట్లు జమ చేశామని, సన్న వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ గా రూ.118.41 కోట్లు ఇచ్చామన్నారు.
ఆహార భద్రత: జిల్లాలో 3,72,658 కార్డుదారులకు నెలకు 6,835 టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 48,493 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామన్నారు.
విద్య, ఉపాధి: హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తిలో ఒక్కొక్కటి రూ.200 కోట్లతో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేశామని, సెప్టెంబర్ 19న కోదాడలో 300 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ప్రకటించారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన ప్రజా పాలన అని, సూర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.




