Suryapet: పాలకవీడులో పీహెచ్‌సీని ప్రారంభించిన మంత్రి!

Suryapet: రూ.1.43 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. సాగు, తాగునీరు రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 21 Aug 2026 8:06 AM IST
Suryapet
X

Suryapet: పాలకవీడులో పీహెచ్‌సీని ప్రారంభించిన మంత్రి!

Suryapet: హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో పాలకవీడు మండల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సాగు, తాగునీటితో పాటు రహదారులు, విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.

పాలకవీడు మండల కేంద్రంలో రూ.1.43 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాలకవీడు ప్రజలపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని, అందుకే మండలానికి అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

రూ.600 కోట్లతో చేపట్టిన జవహర్‌ జాన్‌పహాడ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం పూర్తయితే సుమారు 10 వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.

ఇళ్ల కేటాయింపులో పారదర్శకత

హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి రెండు విడతల్లో 5 వేల ఇళ్లుమంజూరయ్యాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రతి బూత్‌కు 15 ఇళ్ల చొప్పున కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇళ్లు అవసరం లేని ప్రాంతాల్లోని కోటాను అవసరం ఉన్న ప్రాంతాలకు మళ్లిస్తామని స్పష్టం చేశారు.

ఎనిమిది నెలల్లో రోడ్డు పూర్తి

గుడుగుంట్లపాలెం–సింగారం–ఎల్లాపురం స్టేజీ వరకు 8 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.18 కోట్లతో చేపట్టే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రెండు కిలోమీటర్లు సీసీ రోడ్డు, ఆరు కిలోమీటర్లు డాంబర్‌ డబుల్‌ రోడ్డుగా నిర్మించనున్నట్లు తెలిపారు. పనులను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎల్లాపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఇప్పటికే రూ.3.20 కోట్లతో సబ్‌స్టేషన్‌ పనులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్‌ ఆర్డీఓ శ్రీనివాసులు, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ పెండెం వెంకటరమణ, పంచాయతీరాజ్‌ ఈఈ వెంకటయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, పంచాయతీరాజ్‌ డీఈ వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ డీఈ రమేష్, నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ కొనతం చిన్న వెంకటరెడ్డి, సర్పంచులు సుజాత, పెరుమాళ్ల సురేష్, తహసీల్దార్‌ వాజిద్‌ అలీ, ఎంపీడీఓ లక్ష్మి, పీహెచ్‌సీ డాక్టర్‌ నాగిని, మండల పార్టీ అధ్యక్షుడు ఎన్‌.వి.సుబ్బారావు, జిల్లా కార్యదర్శి మాలోత్‌ మోతిలాల్, బెల్లంకొండ నరసింహారావు, నాగిరెడ్డి, జితేందర్‌రెడ్డి, డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమ సీఎజీఎం నాగమల్లేశ్వరరావు, శశిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

Next Story