Suryapet: హుజూర్‌నగర్ నూతన బస్ స్టేషన్‌కు మంత్రుల శంకుస్థాపన

Suryapet: హుజూర్‌నగర్‌లో రూ.3.52 కోట్లతో బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహాలక్ష్మి పథకం విశేషాలు వెల్లడి.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 11 July 2026 6:04 PM IST
Suryapet
X

Suryapet: హుజూర్‌నగర్ నూతన బస్ స్టేషన్‌కు మంత్రుల శంకుస్థాపన

సూర్యాపేట: తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించామని రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం హుజుర్‌నగర్‌లో 3.52 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త బస్ స్టేషన్‌కు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా 10,173 RTC బస్సుల ద్వారా ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 35 లక్షల మంది మహిళలు RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు.

ఉచిత ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు 326 కోట్ల ప్రయాణాలు పూర్తయ్యాయని, దీని ద్వారా మహిళలకు 11,400 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరిందని వివరించారు. మహిళా సంఘాలకు 600 బస్సులు అందించి RTCని మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. "కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది" అని ఆయన అన్నారు. ప్రతి గ్రామానికి RTC బస్సు నడపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కడుపు నింపేందుకు సన్న బియ్యం అందించడంతో పాటు, మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. హుజూర్‌నగర్‌లో కొత్త బస్‌స్టాండ్ నిర్మాణంతో ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో RTC మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్, ఆర్డీవో శ్రీనివాసులు, తాసిల్దార్ కవితతో పాటు పట్టణ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story