Kodad: కోదాడ రూ.17 కోట్లతో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం
Kodad: కోదాడలో రూ.17 కోట్లతో నూతన బస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహిళల ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు.
Kodad: కోదాడ రూ.17 కోట్లతో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రూ. 17 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్ స్టేషన్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే 'మహాలక్ష్మి' పథకం సంచలనం సృష్టిస్తోందని అన్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా మహిళలు ఏకంగా 3 వేల కోట్ల ప్రయాణాలు చేశారని, ఇది మహిళల ఆర్థిక శక్తికి నిదర్శనమని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నంబర్-1 ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సాధికారతను చూసి ఓర్వలేక కొందరు రాజకీయ కారణాలతో అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ ఆర్టీసీ డిపో అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించామని, అత్యాధునిక సదుపాయాలతో బస్ స్టేషన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు సోదరభావంతో కలిసి ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఎత్తిపోతల పథకాలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునరుద్ధరించి, రైతులకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులుగా ముందుకు సాగుతున్నామని, రాబోయే రోజుల్లో కోదాడను మరింతగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పునరుద్ఘాటించారు.




