Miryalaguda: మిర్యాలగూడలో మంత్రుల పర్యటన పకడ్బందీ ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశం
Miryalaguda: ఈనెల 6న మిర్యాలగూడలో మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల పర్యటన. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ బి. చంద్రశేఖర్.
Miryalaguda: మిర్యాలగూడలో మంత్రుల పర్యటన పకడ్బందీ ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశం
మిర్యాలగూడ: ఈనెల 6 న మిర్యాలగూడ లోని తుంగ పహాడ్ వద్ద నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభం, అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కు రాష్ట్ర మంత్రులు రానున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ,ఎస్ సి అభివృద్ధి శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ లు ఈ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్ర మంత్రుల రాక ఏర్పాట్ల విషయమై గురువారం జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో సంబంధిత జిల్లా ,డివిజన్ అధికారులతో సమీక్షించారు. తుంగ పహాడ్ వద్ద ప్రారంభించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అడవిదేవులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం, శాండ్ బజార్లకు శంకుస్థాపన ఏర్పాట్లను సమీక్షించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమావేశ ఏర్పాట్లు, బ్యారికేడింగ్,లైటింగ్ ఏర్పాటు చేయాలని, శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలఫలకాల ఏర్పాటు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సంపులోకి కనెక్షన్ ఇచ్చి నీటితో నింపాలని ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులను ఆదేశించారు.
ఎక్కడ నీరు లీకేజీ కాకుండా చూడాలని ,స్టేజి, డయాస్, పబ్లిక్ అడ్రెస్ సిస్టం ఏర్పాట్లు ముందే చేయాలని, లబ్ధిదారులకు కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి సమాచారం అందించేలా వార్డు అధికారులు, జిపిఓలకు బాధ్యత అప్పగించాలన్నారు. తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, జనరేటర్, ఎల్ఈడి వంటివి ఏర్పాటు చేయాలని, మంత్రివర్యుల రాక సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పగడ్బందీగా క్రమాన్ని నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా గృహ నిర్మాణ పిడి లోకిలాల్, ఆర్డిఓ రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ , గృహ నిర్మాణ, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, తదితర శాఖల అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.




