Miryalaguda: ఎల్ నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Miryalaguda: మిర్యాలగూడలో ఎల్ నినో ప్రభావంపై నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 30 Oct 2026 11:03 PM IST
Miryalaguda
X

Miryalaguda: ఎల్ నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ: ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేసి ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని కళావేదికలో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై నిర్వహించిన నియోజకవర్గస్థాయి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావంతో తాగునీరు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనుషులు, పశువులను రక్షించుకోవడంతో పాటు నీరు, విద్యుత్, భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని 198 గ్రామపంచాయతీలు, 48 మున్సిపల్ వార్డుల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

నాగార్జునసాగర్ నుంచి సాగునీరు అందే అవకాశం లేనందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, యాసంగిలో వరి సాగుకు బదులుగా జొన్నలు, పప్పుధాన్యాలు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అన్నారు. రైతులు తమ వద్ద ఉన్న పశుగ్రాసాన్ని విక్రయించకుండా నిల్వ చేసుకోవాలని సూచించారు.

వీబీ-జీ రామ్‌జీ పథకం కింద వాననీటి సంరక్షణ పనులు చేపట్టాలని, ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి నిల్వ నిర్మాణాలు ఏర్పాటు చేయాలని కోరారు. బస్టాండ్లు, జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

వచ్చే జనవరి నుంచి బీఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా తన 12 నెలల జీతంతో ప్రజలకు తాగునీటితో పాటు పెరుగన్నం అందించనున్నట్లు ప్రకటించారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. దామరచర్ల పెద్ద చెరువును మూసీ నీటితో నింపాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

పంటల మార్పిడితోనే మేలు

ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. యాసంగిలో వరి సాగును నివారించి పంటల మార్పిడిని పాటించాలని, జొన్నలు, పెసర్లు, మినుములు వంటి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. వీబీ-జీ రామ్‌జీ పథకం కింద ఫీడర్ ఛానళ్లు, నీటి నిల్వ నిర్మాణాలు చేపట్టాలని, గ్రామాల్లో సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

గ్రామస్థాయి నుంచి కార్యాచరణ ప్రణాళికలు

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను ఆడిట్ చేసి, వాటి ద్వారా ఎన్ని రోజులు నీటిని సరఫరా చేయవచ్చో అంచనా వేయాలన్నారు. నీటి లీకేజీలను అరికట్టి, నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వీబీ-జీ రామ్‌జీ పథకం కింద ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించాలని, నీటి నిల్వ నిర్మాణాలతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పనులు చేపట్టాలని ఆదేశించారు. రైతు వేదికల్లో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాన్ని, శుక్రవారం జరిగే రైతుల అవగాహన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న, తక్కువ కాలంలో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు.

రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రతి ఇంటిపై పడే వర్షపు నీటిని ఇంకుడు గుంతలు, సోక్‌పిట్లు, ఇతర వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాల ద్వారా భూమిలోకి మళ్లించాలని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం, దాని వల్ల ఎదురయ్యే పరిస్థితులపై వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

అధికారుల అవగాహన కార్యక్రమాలు స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి ఎల్ నినో ప్రభావం, దాని నివారణకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలను వివరించారు. వ్యవసాయం, భూగర్భ జలాలు, ఉద్యానవనం, తాగునీరు, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA