Miryalaguda: మిర్యాలగూడలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ అర్ధరాత్రి నాకాబందీ!
Miryalaguda: మిర్యాలగూడ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ నేతృత్వంలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృత నాకాబందీ తనిఖీలు నిర్వహించారు.
Miryalaguda: మిర్యాలగూడలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ అర్ధరాత్రి నాకాబందీ!
Miryalaguda: నల్లగొండ జిల్లాలో శాంతి భద్రతకు భంగం కలిగించే వారిపై ఎలాంటి రాజీ ఉండదని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ స్పష్టం చేశారు.
మంగళవారం రాత్రి మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
తనిఖీల్లో ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సైలెన్సర్లలో మార్పులు చేసి అధిక శబ్దం చేయడం, నంబర్ ప్లేట్ లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపడం, సరైన వాహన పత్రాలు లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన దాదాపు 150 వాహనాలపై కేసులు నమోదు చేశారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 40 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు.
అర్ధరాత్రి వరకు అనవసరంగా రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, బైక్ రేసింగ్‌లు, సైలెన్సర్లు మార్చి అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమన్నారు. అవసరమైతే వాహనాలను సీజ్ చేసి సంబంధిత చట్టాల ప్రకారం మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గంజాయి, మట్కా, జూదం, అక్రమ మద్యం విక్రయాలు, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలు, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలనైనా పూర్తిగా అణచివేస్తాం. ఇకపై ఇలాంటి కార్యకలాపాలపై నిరంతరం నాకాబందీలు, ప్రత్యేక తనిఖీలు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తాం అని పేర్కొన్నారు.చట్టాన్ని ఉల్లంఘించే వారికి ఎలాంటి మినహాయింపు ఉండదు అని ఎస్పీ స్పష్టం చేశారు.
పట్టణంలోని దాబాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, టీ స్టాళ్లు తదితర వ్యాపార సంస్థల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికే తమ వ్యాపార సంస్థలను మూసివేయాలని సూచించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత వ్యాపారాలు నిర్వహించడం, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పించడం, చట్టవిరుద్ధ సమావేశాలకు సహకరించడం వంటి చర్యలు గుర్తిస్తే యజమానులపైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేసి పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
ఈ విస్తృత నాకాబందీ కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, సీఐలు నాగభూషణ్, సోమనర్సయ్య, పి.ఎన్.డి. ప్రసాద్, ఎస్‌ఐలు మరియు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని తనిఖీలు నిర్వహించారు.




