Miryalaguda: దామరచర్ల-జాన్ పహాడ్ రహదారిపై ప్రమాదకర చెట్లను తొలగించాలి!

Miryalaguda: దామరచర్ల - జాన్ పహాడ్ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించి, గుంతలను పూడ్చాలని సామాజిక కార్యకర్త నక్క శ్రీనివాస్ మిర్యాలగూడ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 26 Oct 2026 1:50 PM IST
Miryalaguda
X

Miryalaguda: దామరచర్ల-జాన్ పహాడ్ రహదారిపై ప్రమాదకర చెట్లను తొలగించాలి!

Miryalaguda: దామరచర్ల మండల కేంద్రం నుంచి జానపహాడ్ దర్గా, నేరేడుచర్ల, మఠంపల్లి సిమెంట్ ఫ్యాక్టరీలకు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించి, రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి రోడ్డు ప్రమాదాలను నివారించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త నక్క శ్రీనివాస్ మిర్యాలగూడ ఆర్డీవో కు సోమవారం ఫిర్యాదు చేశాడు.

ఈ సందర్భంగా నక్క శ్రీనివాస్ మాట్లాడుతూ, దామరచర్ల నుంచి జానపహాడ్ దర్గా, ఆధాని గ్రూప్ సిమెంట్ ఫ్యాక్టరీ, డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు నేరేడుచర్ల, మఠంపల్లి ప్రాంతాలకు వెళ్లే ఈ ప్రధాన రహదారిపై ప్రతిరోజూ భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లే భారీ లారీలు, ఇతర వాహనాలతో రహదారి నిత్యం రద్దీగా ఉంటుందని పేర్కొన్నారు.

ప్రతి శుక్రవారం జానపహాడ్ దర్గాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారని, దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు మరింత పెరుగుతాయని తెలిపారు. ఇలాంటి రద్దీ మార్గంలో రహదారికి ఇరువైపులా పెరిగిన పెద్దపెద్ద చెట్లు, రోడ్డుపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు ఇబ్బందులు కలిగించడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రహదారిలోని మలుపులు, ఇరుకైన ప్రాంతాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల రోజుకొక ప్రమాదాలు జరుగుతున్నాయి గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు వాటిని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ప్రాణనష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

అంతేకాకుండా రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) అధికారులతో సమన్వయం చేసుకుని సంబంధిత రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నక్క శ్రీనివాస్ తన ఫిర్యాదులో కోరారు. వాహనదారులకు దృష్టి అడ్డంకిగా మారుతున్న చెట్లను గుర్తించి, నిబంధనల ప్రకారం అవసరమైన చోట తొలగించడం లేదా కొమ్మలను కత్తిరించడం చేపట్టాలని, అలాగే రోడ్డుపై ఉన్న ప్రమాదకర గుంతలను పూడ్చాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల ప్రాణాలను కాపాడటం అధికారుల బాధ్యత అని, ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితులను ముందుగానే తొలగించడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను అత్యవసర ప్రజా భద్రతా అంశంగా పరిగణించి, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త నక్క శ్రీనివాస్ కోరారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA