Devarakonda: ఉచిత కూరగాయల విత్తనాల పంపిణీతో రైతులకు ప్రోత్సాహం!

Devarakonda: దేవరకొండ వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రైతులకు రూ.1,000 విలువైన 650 గ్రాముల కూరగాయల విత్తనాల మినీ కిట్లు పంపిణీ చేశారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 19 Nov 2026 2:12 PM IST
Devarakonda
X

Devarakonda: ఉచిత కూరగాయల విత్తనాల పంపిణీతో రైతులకు ప్రోత్సాహం!

దేవరకొండ: రైతుల సంక్షేమం, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ అన్నారు.

గురువారం దేవరకొండ పట్టణ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఒక్కొక్కరికి రూ.1,000 విలువైన 650 గ్రాముల కూరగాయల విత్తనాల మినీ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు.

సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని, అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా వర్షాధార పంటలైన పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం

కూరగాయల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని, ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలను సైతం స్వయంగా పండించుకోవచ్చని తెలిపారు. ఉద్యాన పంటల సాగుపై రైతులు ఆసక్తి పెంచుకోవాలని, వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులు అందించే సూచనలు, సలహాలు పాటిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుంటూ నష్టాలను నివారించుకోవాలని పేర్కొన్నారు.

రైతుల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతులకు అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నర్సింహా, దూదిపాల వేణుధర్ రెడ్డి, హనుమంతు, వెంకటేష్ గౌడ్, మేకల రాజేందర్ రెడ్డి, లోకసాని కృష్ణయ్య, కొర్ర రాంసింగ్, అంగిరేకుల నాగభూషణం, కాయితి నారాయణ రెడ్డి, దేవరకొండ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA