Devarakonda: దేవరకొండలో 1,150 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ!
Devarakonda: దేవరకొండ మండలం, పట్టణానికి చెందిన 1,150 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శుక్రవారం నూతన చేయూత పింఛన్ మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేశారు.
Devarakonda: దేవరకొండలో 1,150 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ!
దేవరకొండ: గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయని బీఆర్ఎస్ పాలకులు, నేడు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ విమర్శించారు.
శుక్రవారం దేవరకొండ పట్టణం, సాయి శివ ఫంక్షన్ హాల్లో దేవరకొండ మండలానికి చెందిన 1,150 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల కష్టాలను గుర్తించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు రుణాలు, పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, మహిళల భద్రతకు ఇందిరమ్మ భీమా, మహిళలకు మహిళా సమాఖ్య భవనాలు, వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.
గత పాలకులు పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం కాకుండా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ సంకల్పమని, దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలు నాయక్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో పాటు మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నర్సింహా, హనుమంతు వెంకటేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ రయీస్, మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, దూదిపాల వేణుధర్ రెడ్డి, లోకసాని శ్రీధర్ రెడ్డి, కొర్ర రాంసింగ్ నాయక్, పట్టణ కౌన్సిలర్లు, మండల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




