Nakrekal: స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీరేశం

Nakrekal: నకిరేకల్‌లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈనెల 5న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.200 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 3 Sept 2026 11:09 PM IST
Nakrekal
X

Nakrekal: స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని గుడిపాటి ఫంక్షన్ హాల్‌లో నకిరేకల్ మున్సిపాలిటీ మరియు మండలానికి సంబంధించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నకిరేకల్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగా రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరగనున్నట్లు తెలిపారు.

అలాగే ఇళ్లు లేని నిరుపేదలకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వారి సొంతింటి కలను సాకారం చేస్తామని, పలు ప్రభుత్వ కార్యాలయాల నూతన భవనాలకు కూడా శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు.

నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉంటుందని, దేశంలోనే ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 1000 రోజుల కాలంలోనే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story