Nakrekal: నకిరేకల్‌లో రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా ఆందోళన

Nakrekal: రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా నకిరేకల్‌లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 23 July 2026 2:41 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్‌లో రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా ఆందోళన

నకిరేకల్: నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్‌లో నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, దేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, ఏఐసీసీ నాయకత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తుంటే వారిపై లాఠీచార్జ్ చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. విద్యార్థులకు మద్దతుగా ధర్నా చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.

నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.

బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతిపక్షాలపై కక్షపూరిత చర్యలు మానుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు చామల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల–మాధవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదగోని కొండయ్య ,టౌన్ అధ్యక్షులు లింగాల వెంకన్న,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story