Devarakonda: సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్: ఆరుతడి పంటలే మేలు!
Devarakonda: నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లిలో 100 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రైతులకు పంపిణీ చేశారు.
Devarakonda: సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్: ఆరుతడి పంటలే మేలు!
దేవరకొండ: చందంపేట మండలంలో సూపర్ ఎల్నినో ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి – వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి త్వరలో ఏదుల నుంచి డిండి ప్రాజెక్టులోకి నీరు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు – ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
పోలేపల్లి (చందంపేట మండలం), రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, పంటల సాగు, సాగునీటి లభ్యత తదితర అంశాలపై వివరించారు 100 శాతం సబ్సిడీతో ఉచితంగా వేరుశనగ విత్తనాలు*
రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం 700 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సంబంధిత సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయంలో ముందుకు సాగాలని సూచించారు.
సూపర్ ఎల్నినో ప్రభావం.. రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో వరి పంట సాగుకు దూరంగా ఉండాలని, వరికి బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలైన వేరుశనగ తదితర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు సూచించే పంటలను ఎంచుకోవాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పంట నష్టాలను నివారించుకోవాలని తెలిపారు.
90 బోర్లు ఎండిపోయాయి.. నీటిని పొదుపుగా వాడుకోవాలి
సూపర్ ఎల్నినో ప్రభావంతో నియోజకవర్గంలో తాగునీటిని అందించే బోర్లు సైతం ఎండిపోతున్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో సుమారు 90 బోర్లు ఎండిపోయాయని, వాటిలో అత్యధికంగా ఉమ్మడి చందంపేట మండల పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు నీటి లభ్యతను అంచనా వేసుకొని పంటల సాగు చేపట్టాలని, వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసి ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచి నీరు తీసుకొచ్చేందుకు కృషి
దేవరకొండ ప్రాంత రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో ఏదుల నుంచి డిండి ప్రాజెక్టులోకి నీటిని తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, తద్వారా ఈ ప్రాంత వ్యవసాయానికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.
రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్, సబ్సిడీపై విత్తనాల పంపిణీ, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు అండగా నిలుస్తోందన్నారు. ప్రకృతి పరిస్థితులను అర్థం చేసుకొని వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో పాటు దొండేటి మల్లారెడ్డి, ఏడుపుల గోవింద్ యాదవ్, మేకల రాజేందర్ రెడ్డి, కిన్నెర హరికృష్ణ, వాంకునావత్ పాపా నాయక్, కేతావత్ భరత్, జక్కుల మున్నయ్య యాదవ్, కొప్పుల సురేందర్ రెడ్డి, మండల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




