Nalgonda: ఏఓబీ నుంచి నల్లగొండకు గంజాయి.. పోలీసుల ఉక్కుపాదం
Nalgonda: నల్లగొండ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Nalgonda: ఏఓబీ నుంచి నల్లగొండకు గంజాయి.. పోలీసుల ఉక్కుపాదం
Nalgonda: రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో, నల్లగొండ జిల్లా పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఆంధ్ర - ఒడిశా సరిహద్దు (ఏఓబీ) నుంచి అక్రమంగా గంజాయి తరలించి పట్టణంలో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ టూటౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష విలువ చేసే 5 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని అదనపు ఎస్పీ రమేశ్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండకు చెందిన కోరేపల్లి అభినవ్ (A-1) తన స్నేహితులతో కలిసి వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే దొంగతనాలు, గంజాయి విక్రయాలకు అలవాటు పడ్డాడు. వారం క్రితం ఏఓబీలోని సీలేరు ప్రాంతం నుంచి కిలో మూడు వేల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి, ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
శనివారం పట్టణంలోని ఉడిపి హోటల్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో ఎస్సై సైదులు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి ఐదుగురిని పట్టుకున్నారు.ఈ కేసులో అభినవ్‌తో పాటు రాకేశ్, మోహన్ కృష్ణ, రాజేశ్, శివసాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఆరుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సరఫరా చేసినా, వాడినా ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ రాఘవరావు, ఎస్సై సైదులు బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.




