Nalgonda: నల్లగొండ జిల్లాలో అర్ధరాత్రి ‘నాఖా బందీ’

Nalgonda: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి పోలీసులు నాఖా బందీ నిర్వహించారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 31 May 2026 7:48 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ జిల్లాలో అర్ధరాత్రి ‘నాఖా బందీ’

Nalgonda: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS ఆదేశాల మేరకు శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల్లో నాఖా బందీ నిర్వహించి ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని వివిధ ప్రాంతాల్లో తనిఖీలను పరిశీలిస్తూ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.

నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండతో పాటు ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారులు, రద్దీ కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాలు మరియు రాత్రి వేళల్లో యువకుల గుంపులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మరియు ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, నంబర్ ప్లేట్లు పరిశీలించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లు మార్పులు చేసిన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 260 వాహనాలపై చర్యలు తీసుకున్నారు.

అదేవిధంగా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వాహనాల కదలికలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS మాట్లాడుతూ, “జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారు, రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని స్పష్టం చేశారు.

అదేవిధంగా యువత చట్టాలను గౌరవించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించిన ఎస్పీ, రోడ్లపై స్టంట్లు చేయడం, అధిక శబ్దాలతో వాహనాలు నడపడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై వెంటనే సమాచారం అందించాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story