Nalgonda: నల్గొండ గడ్డపై కవిత సమరశంఖం.. సర్కార్‌పై తీవ్ర విమర్శలు!
Nalgonda: నల్గొండ వేదికగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Nalgonda: నల్గొండ గడ్డపై కవిత సమరశంఖం.. సర్కార్‌పై తీవ్ర విమర్శలు!
Nalgonda: నల్గొండ వేదికగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్లాక్ టవర్ సర్కిల్‌లో మలి దశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆమె, అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. మనోరమ హోటల్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతుల సమస్యలపై గళమెత్తారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఘాటు విమర్శలు చేశారు."అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయ శాఖపై ఒక్క సమీక్షా చేయని సీఎం, రైతులను ఎలా ఆదుకుంటారు?" అని ప్రశ్నించారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను ఎగ్గొట్టి అన్నదాతలను అరిగోస పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ఏడాదిలో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రైతు భరోసా సాయం చేసే సంకుచిత ధోరణిని రైతులు గమనించాలని సూచించారు.
ముఖ్యంగా, 'రైతు డిస్కం' పేరుతో ఉచిత విద్యుత్తును ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, డిస్కమ్‌లను ప్రైవేట్ పరం చేసేందుకు రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని హెచ్చరించారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రిపై సంచలన ఆరోపణలు చేసిన కవిత, అసైన్డ్ భూములను భారీగా కొనుగోలు చేసి, ఎన్నికల ముందు పట్టాల పేరుతో సామాన్య రైతులను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.
దిండి ప్రాజెక్టు సోర్స్ పాయింట్ మార్పు విషయంలో జరుగుతున్న రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నల్గొండ రైతులకు సాగునీరు అందాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్య, వైద్యం, రైతుకు గౌరవం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయం అనే 'పాంచజన్యం' ఐదు సూత్రాలతో తమ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
పిడికెడు మందితో మొదలైన పోరాటమే చరిత్రను తిరగరాస్తుందని, రైతుల కోసం ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొని, తమ సలహాలను సూచనలను కవితకు వివరించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కవిత హెచ్చరించారు.




