Arvapalli: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం రావడం గర్వకారణం!
Arvapalli: కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం రావడం గర్వకారణం అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రత్యేక పూజలు.
Arvapalli: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం రావడం గర్వకారణం!
అర్వపల్లి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ తనకు నల్గొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం పట్ల అభ్యర్థి కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబానికి నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. తన తండ్రి స్వర్గీయ రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి, పెద్దనాన్న స్వర్గీయ రామ్‌రెడ్డి వెంకటరెడ్డి ప్రజా సేవకు అంకితమయ్యారని తెలిపారు.
తన తండ్రి తెలంగాణ కోసం, ఈ ప్రాంతానికి సాగునీరు సాధించేందుకు అనేక ఉద్యమాలు చేపట్టారని గుర్తుచేశారు. శ్రీరాంసాగర్ జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ఆయన చేసిన పోరాటాలు కీలకమని పేర్కొన్నారు. 1996లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని తన తండ్రి బలంగా వినిపించారని తెలిపారు.తాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుని గోల్డ్ మెడలిస్ట్‌గా, స్కూల్ టాపర్‌గా నిలిచానని, ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించానని చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈ పూర్తి చేసి, అమెరికాలో మాస్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ (ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ)లో డ్యూయల్ మాస్టర్స్ చేసినట్లు వివరించారు. అమెరికాలోని క్యాపిటల్ వన్ బ్యాంక్‌లో పనిచేస్తూ అమెరికా, కెనడా, యూకేల్లో సుమారు పదేళ్ల అనుభవం సంపాదించినట్లు తెలిపారు.కుటుంబానికి దగ్గరగా ఉండటంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగి వచ్చానని అన్నారు.
2012 నుంచి రైతుగా, డెయిరీ ఫార్మర్‌గా, ఆక్వాకల్చర్ రంగంలో పనిచేశానని, పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో సంస్థలను స్థాపించానని తెలిపారు. 2014, 2018, 2019, 2024లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అవకాశం కోరినప్పటికీ అప్పట్లో అవకాశం రాలేదని చెప్పారు.ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడం తన కుటుంబానికి, కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని అన్నారు.
గ్రాడ్యుయేట్లలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు తదితర అన్ని వర్గాల వారు ఉన్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు చేరువగా పనిచేసే అవకాశం తనకు ఉందని తెలిపారు.
గ్రాడ్యుయేట్ ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అర్హులైన వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. నవంబర్ 6 వరకు సమయం ఉన్నందున ఎన్‌రోల్‌మెంట్‌ను వేగవంతం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తన కుటుంబ ఇలవేల్పు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తమ కుటుంబానికి ఈ దేవస్థానంతో అనుబంధం ఉందని, దేవస్థాన పరిధిలో 850 ఎకరాల భూమిని తమ కుటుంబం ఇచ్చిన చరిత్ర ఉందని పేర్కొన్నారు.
తన తండ్రి రాజకీయ జీవితంలో ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని అన్నారు. తనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.




