Suryapet: జాతీయ క్రికెట్‌కు ఎంపికైన పల్లవికి కలెక్టరేట్‌లో ఘన సన్మానం

Suryapet: జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపికైన సూర్యాపేట జిల్లా క్రీడాకారిణి మణిమద్దె పల్లవిని కలెక్టర్‌ తేజస్‌ పవార్‌, ఎస్పీ నరసింహ ఘనంగా సత్కరించారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 26 Oct 2026 6:45 PM IST
Suryapet
X

Suryapet: జాతీయ క్రికెట్‌కు ఎంపికైన పల్లవికి కలెక్టరేట్‌లో ఘన సన్మానం

సూర్యాపేట జిల్లా: జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారిణి మణిమద్దె పల్లవిని సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా సన్మానించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళా సాధికారత కేంద్రం (డీహెచ్‌ఈడబ్ల్యూ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహ పల్లవిని శాలువాతో సత్కరించి అభినందించారు.

‘బేటీ బచావో.. బేటీ పడావో’ లోగోతో కూడిన క్రీడా దుస్తులు, క్రికెట్‌ బూట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. పట్టుదల, అంకితభావంతో సాధన చేసి పోటీల్లో ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఎస్పీ నరసింహ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పల్లవి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త చైతన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమణ, ఫిజికల్‌ డైరెక్టర్‌ మీసాల కిరణ్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రతాప్‌, పల్లవి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET