Kodad: కోదాడ పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం!

Kodad: కోదాడ పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఖానాపురం సర్వే నంబర్ 87లో నిర్మించిన భారీ ప్రహరీ గోడను జేసీబీలతో కూల్చివేసి ఎకరన్నర భూమిని స్వాధీనం చేసుకున్నారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 17 Nov 2026 10:12 AM IST
Kodad
X

Kodad: కోదాడ పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం!

Kodad: పెద్ద చెరువు భూముల ఆక్రమణలపై అధికారులు ఎట్టకేలకు కొరడా ఝుళిపించారు. చెరువు భూమిని ఆక్రమించి నిర్మించిన భారీ ప్రహరీ గోడను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు జేసీబీల సహాయంతో కూల్చివేశారు. సుమారు ఎకరన్నర భూమిలో జరిగిన ఆక్రమణను తొలగించి చెరువు భూమిని పరిరక్షించే దిశగా చర్యలు చేపట్టారు. ఖానాపురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 87లో ఈ కూల్చివేతలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కోదాడ పెద్ద చెరువు సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, గతంలో దాదాపు 300 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చెరువుపై సుమారు 600 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అలాగే చెరువు ఆయకట్టు కింద పలు గ్రామాల రైతులు సాగునీటిని వినియోగించుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. ఆక్రమణల కారణంగా చెరువు విస్తీర్ణం తగ్గడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెరువు ఆక్రమణలపై పలువురు సామాజిక కార్యకర్తలు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. గతంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. 2009-10 సంవత్సరంలో అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్ మూడు కమిటీలను ఏర్పాటు చేసి చెరువు భూములపై సర్వే నిర్వహించారు. సర్వేలో ఆక్రమణలు జరిగినట్లు నివేదికలు రావడంతో పలువురికి నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి కొంతకాలంగా న్యాయస్థానంలో కేసులు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా, కోదాడ పెద్ద చెరువును ఆనుకొని ఉన్న ఖానాపురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 87లో గతంలోనే ఆక్రమణలు జరిగి భారీ భవన నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం కోర్టు విచారణలో ఉండగానే తాజాగా మరోసారి సుమారు ఎకరన్నర చెరువు భూమిని ఆక్రమించి భారీ ప్రహరీ గోడ నిర్మించినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.

దీంతో కోదాడ పెద్ద చెరువు కమిటీ చైర్మన్, ఖానాపురం గ్రామ సర్పంచ్, మత్స్యశాఖ సభ్యులు సంబంధిత అధికారులను కలిసి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్, ఇరిగేషన్ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆక్రమణలను నిర్ధారించారు. అనంతరం జేసీబీల సహాయంతో భారీ ప్రహరీ గోడను కూల్చివేసి ఆక్రమిత స్థలాన్ని తొలగించారు.

మరోవైపు కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలపై గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఇప్పటికీ చెరువు ఇరువైపులా కొత్త నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అధికారులు చేపట్టిన కూల్చివేతలతో అక్రమ నిర్మాణాలు చేపట్టేవారిలో ఆందోళన మొదలైంది. కోర్టు పరిధిలో ఉన్న మిగిలిన ఆక్రమణలపై చట్టపరమైన ప్రక్రియ పూర్తిచేసి త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ వెల్లడించారు.

తాజాగా చేపట్టిన కూల్చివేతలు ఒక్కచోటుకే పరిమితం కాకుండా కోదాడ పెద్ద చెరువు మొత్తం విస్తీర్ణంపై సమగ్ర సర్వే నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

చెరువు భూముల్లో జరిగిన అన్ని ఆక్రమణలను గుర్తించి చట్టపరంగా తొలగించాలని, 600 మత్స్యకార కుటుంబాల జీవనాధారంతో పాటు రైతుల సాగునీటి అవసరాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టి కోదాడ పెద్ద చెరువును పూర్తిస్థాయిలో ఆక్రమణల నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD