Kondamallepally: ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేయాలి: బాలు నాయక్

Kondamallepally: కొండమల్లేపల్లి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని సూపర్ ఎల్‌నినో ముందస్తు చర్యలు, కొండమల్లేపల్లిలో వాహన రిజిస్ట్రేషన్ కార్యాలయ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 12 Nov 2026 6:36 PM IST
Kondamallepally
X

Kondamallepally: ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేయాలి: బాలు నాయక్

కొండమల్లేపల్లి: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు పాల్గొని మండలంలోని వివిధ శాఖల పనితీరు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సూపర్ ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా వ్యవసాయానికి సాగునీటి సమస్యలు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని, రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు.

మండలంలోని అర్హత కలిగిన గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా, తాగునీరు, రహదారులు తదితర మౌలిక వసతుల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

కొండమల్లేపల్లిలోనే మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు..

దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త అందిస్తూ.. ఇప్పటివరకు కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం మిర్యాలగూడకు వెళ్లాల్సి వస్తోందని, ప్రజల ప్రయాణ భారాన్ని తగ్గించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కొండమల్లేపల్లి పట్టణంలో ప్రస్తుత ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో, మండల ప్రత్యేక అధికారి, మైనారిటీ ఏడీఏతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA