Suryapet: ముగిసిన 'ఆపరేషన్ ముస్కాన్': 127 మంది బాలల గుర్తింపు
Suryapet: జూలై నెలలో నిర్వహించిన 12వ విడత ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 127 మంది బాల కార్మికులను రక్షించి, 90 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు.
Suryapet: ముగిసిన 'ఆపరేషన్ ముస్కాన్': 127 మంది బాలల గుర్తింపు
సూర్యాపేట: జిల్లాలో జూలై నెలలో చేపట్టిన 12వ విడత ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పి కె.నరసింహ ఐపిఎస్ తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. వెట్టిచాకిరికి, నిరాదరణకు గురైన బాలబాలికలను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి సంరక్షించేందుకు ప్రతి ఏడాది జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ నెలరోజుల పాటు జిల్లా పోలీసు, రెవెన్యూ, లేబర్, ఆరోగ్యం, బాలల సంక్షేమం తదితర శాఖల సమన్వయంతో పకడ్బందీగా తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 127 మంది బాలలను గుర్తించి తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించినట్లు వివరించారు.
గుర్తించిన వారిలో తెలంగాణకు చెందిన 56 మంది ఉండగా, వీరిలో 52 మంది బాలురు, 4 గురు బాలికలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 71 మంది ఉండగా, వీరిలో 65 మంది బాలురు, 6 గురు బాలికలు ఉన్నారని ఎస్పి తెలిపారు. ఈ మేరకు 90 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
రెస్క్యూ ఆపరేషన్స్‌లో చురుగ్గా పాల్గొని ఎక్కువ మంది పిల్లలను సంరక్షించిన పోలీసు సిబ్బంది, బాలల సంరక్షణ అధికారులు, ఇతర శాఖల సిబ్బందిని ఆయన అభినందించారు. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యమని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
పిల్లలను వెట్టిచాకిరికి గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలల రక్షణ కోసం నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నాయని, తల్లిదండ్రులు పిల్లలను చదివించి వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్ రాజ్, డిసిఆర్బి డిఎస్పి రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దుం అలీ, మహిళా ఎస్ఐలు మౌనిక, నీలిమ, చైల్డ్ సంరక్షణ అధికారులు శ్రీలక్ష్మి, ఉమామహేశ్వరి, నాగులమీరా, నాగరాజు, వంశీ, విద్యాసాగర్, ముస్కాన్ బృందం ఎస్ఐ మల్లేశం, రహిముద్దిన్, ఏఎస్ఐ వెంకన్న, ఏఎస్ఐ సైదాబి, లేబర్ శాఖ సిబ్బంది సందీప్ తదితరులు పాల్గొన్నారు.




