PA Pally: పీఏపల్లిలో రూ.2.10 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం!

PA Pally: పీఏ పల్లి మండలం రంగారెడ్డిగూడెంలో రూ.2.10 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్, మహిళా సమాఖ్య భవనం ప్రారంభం. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 17 Oct 2026 6:53 PM IST
PA Pally
X

PA Pally: పీఏపల్లిలో రూ.2.10 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం!

పీఏ పల్లి: రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా వ్యవసాయానికి మెరుగైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు అన్నారు. శనివారం పీఏ పల్లి మండలం మేడారం గ్రామ పరిధిలోని రంగారెడ్డి గూడెంలో రూ.2.10 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అలాగే పీఏ పల్లి మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంగారెడ్డి గూడెం ప్రాంతంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్నది స్థానిక ప్రజలు, రైతుల పదేళ్ల కల అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కల సాకారమైందని పేర్కొన్నారు. నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో పరిసర ప్రాంతాల రైతులకు విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు, లో-వోల్టేజీ, అధిక లోడ్ వంటి సమస్యలు తగ్గేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

రైతులు విద్యుత్ సమస్యల కారణంగా పంట నష్టపోయే పరిస్థితి రాకూడదని, సబ్‌స్టేషన్ పరిధిలోని రైతుల పంట పొలాల్లో ఒక్క గుంట భూమి కూడా విద్యుత్ సమస్యలతో ఎండిపోకుండా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

అనంతరం మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, సంఘ కార్యకలాపాలపై చర్చించుకోవడానికి, పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి వంటి అంశాలపై ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. మహిళలు సంఘటితంగా ముందుకు సాగుతూ ఆర్థికంగా బలోపేతం కావాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా పీఏ పల్లి మండలానికి చెందిన కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేయాలని, లబ్ధిదారులు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడటం, మహిళా సంఘాలకు అవసరమైన వసతులు కల్పించడం, పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవడం ప్రభుత్వ ప్రాధాన్యతలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నెర్మటి సతీష్ రెడ్డి, ఏవీ రెడ్డి, సత్యం రెడ్డి, కుక్కల గోవర్ధన్ రెడ్డి, ఎలూగూరి జయమ్మ, భాస్కర్ రెడ్డి, గొంగడాల వెంకటయ్య, రాగం అంజయ్య, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మావిల్ల లక్ష్మీనారాయణ యాదవ్, ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్, మద్దిమడుగు రామస్వామి, కొర్ర రాంసింగ్, మండల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA