Suryapet: సూర్యాపేట బీఆర్ఎస్ నేతలపై పటేల్ రమేష్ రెడ్డి ఫైర్

Suryapet: బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించిన పటేల్ రమేష్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై నిప్పులు చెరిగిన మాజీ చైర్మన్. కీలక సవాళ్లు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 10 July 2026 8:35 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట బీఆర్ఎస్ నేతలపై పటేల్ రమేష్ రెడ్డి ఫైర్

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి బీఆర్ఎస్ టాప్ లీడర్‌షిప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను రూ. 8.20 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి ఆర్థిక విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన పాపాల వల్ల ఏర్పడిన అప్పులు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారని, వనరులను సమీకరించి ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారని కొనియాడారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా రేవంత్ సర్కార్ అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌పై ప్రధాన ఆరోపణలు

అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు.

కేటీఆర్, హరీష్ రావు బిల్లా, రంగా లాగా పోటీపడి కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలతో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

10 ఏళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో నియోజకవర్గంలో రూ. 5 లక్షల వ్యయంతో 3 వేల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తోందని గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు

కాళేశ్వరం ప్రాజెక్టు, మేదిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్న విజువల్స్‌ను ప్రస్తావిస్తూ, కాళేశ్వరంతోనే సూర్యాపేట సస్యశ్యామలం అయ్యిందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందే 'జలయజ్ఞం' ద్వారా శ్రీరామ్ సాగర్ నీళ్లను సూర్యాపేటకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు.

రూ. 1.27 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం వల్ల కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టు కూడా పెరగలేదని, కేవలం కమీషన్ల కోసమే అంచనాలు పెంచారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేవని అన్నారు. కాళేశ్వరం నీళ్లు చుక్క వాడుకోకుండానే రూ. 33 వేల కోట్ల అప్పు కట్టాల్సి వచ్చిందని, మూడేళ్లకే 'కాళేశ్వరం' కాస్త 'కులేశ్వరం'గా మారిందని విమర్శించారు. ప్రస్తుతం మేదిగడ్డను నీళ్లతో నింపితే చుట్టుపక్కల గ్రామాలకు ముప్పు ఉందని హెచ్చరించారు.

ఫామ్‌హౌస్‌లపై ప్రశ్నలు

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలకు వేల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు ఎక్కడివని ప్రశ్నించారు. ఆ వేల కోట్ల సంపద ఎలా వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

3 వారాలు సమయం ఇస్తే ప్రాజెక్టులను బాగు చేస్తానంటున్న హరీష్ రావు, 9 ఏళ్ల పాలనలో ఏం చేశారని నిలదీశారు. కేసీఆర్‌కు దమ్ముంటే 3 నెలలు సమయం అడిగి అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.

ఎన్ని కుట్రలు చేసినా త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేసి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగంలోకి తెస్తామని పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story