Huzurnagar: హుజూర్‌నగర్ ZPHS పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు!
Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ZPHS పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Huzurnagar: హుజూర్‌నగర్ ZPHS పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు!
హుజుర్నగర్: హుజూర్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో విద్యార్థుల కోసం వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన నైపుణ్యాల కోచ్, వ్యక్తిత్వ వికాస శిక్షకులు, ఉపాధ్యాయులు చారుగుండ్ల రాజశేఖర్ విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, లక్ష్య సాధన వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించడం, సమస్యలను అవకాశాలుగా మలుచుకోవడం, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం అలవర్చుకోవాలన్నారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితాలను ఉదాహరణగా వివరిస్తూ, వారి విజయాల వెనుక ఉన్న కష్టపాటు, నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ వంటి లక్షణాలను విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు.
పాఠ్యపుస్తకాల జ్ఞానంతో పాటు జీవన నైపుణ్యాలను పెంపొందించుకొని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగగిరి ప్రధానోపాధ్యాయులు పెనుగొండ శ్రీనివాస్, హుజూర్‌నగర్ మండల విద్యాధికారి సైదా, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు జానీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




