Suryapet: రైల్వే సాధన సమితి నేత ప్రతాప్ ముందస్తు అరెస్ట్‌కు యత్నం!

Suryapet: సూర్యాపేటకు రైల్వే లైన్ సాధన కోసం ప్రశ్నిస్తున్న రాచూరి ప్రతాప్‌ను ముందస్తు అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించడం కలకలం రేపింది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 10 Aug 2026 8:44 AM IST
Suryapet
X

Suryapet: రైల్వే సాధన సమితి నేత ప్రతాప్ ముందస్తు అరెస్ట్‌కు యత్నం!

Suryapet: జిల్లా కేంద్రానికి రైల్వే లైన్ తీసుకురావాలని, ప్రాంతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ రైల్వే అలైన్మెంట్‌ను మార్చవద్దని ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆకాంక్షను చాటడమే తప్పా? అంటూ సూర్యాపేట రైల్వే సాధన సమితి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను పురస్కరించుకుని, దశాబ్దాలుగా నానబెడుతున్న రైల్వే లైన్ అంశంపై ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసనను తెలియజేసేందుకు సిద్ధమైన ‘రైల్వే సాధన సమితి’ కో-కన్వీనర్ శ్రీ రాచూరి ప్రతాప్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడానికి ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వ తీరును, పోలీసుల చర్యను రైల్వే సాధన సమితి నాయకులు ఖండించారు.

ప్రశ్నించే గొంతుకను నొక్కేయలేరు!

సూర్యాపేట ప్రజల సుదీర్ఘ స్వప్నమైన రైల్వే లైన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ "సూర్యాపేటకు రైలు రాకుండా అలైన్మెంట్ మార్చడం సిగ్గు! సిగ్గు!" అని ప్రజల గొంతుకగా నినదించడం ప్రజాస్వామ్యంలో నేరం ఎలా అవుతుందని నాయకులు ప్రశ్నించారు. ప్రభుత్వాలు అరెస్టులతో నాయకుల శరీరాలకు సంకెళ్లు వేయగలవేమో కానీ, సూర్యాపేట సమగ్ర అభివృద్ధి కోసం ఉద్యమిస్తున్న ప్రజల దృఢ సంకల్పాన్ని, వారి గుండెల్లో రగులుతున్న ఆకాంక్షను ఆపలేవని స్పష్టం చేశారు.

ఒక ప్రతాప్‌ను అరెస్టు చేసినంత మాత్రాన సూర్యాపేట ప్రజల గుండెల్లోంచి వచ్చే ప్రజాస్వామ్యయుత ప్రశ్నను అరెస్టు చేయగలరా? ఒక గొంతును నొక్కినంత మాత్రాన లక్షలాది మంది ప్రజల రైల్వే ఆకాంక్షను ఆపడం సాధ్యమా? అని నాయకులు నిలదీశారు.

పోరాటం ఆగేది లేదు,రాజకీయ ప్రయోజనాలు, ఇతర కారణాల వల్ల సూర్యాపేటకు దక్కాల్సిన రైల్వే అలైన్మెంట్‌ను వేరే దారికి మళ్లించడం ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడమేనని సాధన సమితి స్పష్టం చేసింది. ముందస్తు అరెస్టులు, అణచివేత ధోరణులకు భయపడేది లేదని, సూర్యాపేటకు రైలు వచ్చే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని సాధన సమితి స్పష్టం చేసింది.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story