Nalgonda: నల్గొండలో తప్పిన పెను ప్రమాదం.. డ్రైవర్ అప్రమత్తతతో 40 మంది క్షేమం!
Nalgonda: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం.
Nalgonda: నల్గొండలో తప్పిన పెను ప్రమాదం.. డ్రైవర్ అప్రమత్తతతో 40 మంది క్షేమం!
నల్గొండ జిల్లా: చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైన ఘటన కలకలం రేపింది.హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి కాకినాడకు వెళ్తున్న రెయిన్‌బో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెద్దకాపర్తి సమీపానికి చేరుకోగానే ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపాడు.దీంతో బస్సులో ఉన్న సుమారు 40 మంది ప్రయాణికులు హుటాహుటిన బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రయాణికులు దిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది.
చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమవగా, ప్రయాణికుల సామాన్లు కూడా మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. ఘటనతో కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.




