Suryapet: నూతనకల్ సాగునీటి కోసం రైతుల నిరసన ధర్నా
Suryapet: నూతనకల్‌లో సాగునీటి సమస్యపై ధర్నా. కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి, గోదావరి జలాలు విడుదల చేయాలని రైతులు, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన.
Suryapet: నూతనకల్ సాగునీటి కోసం రైతుల నిరసన ధర్నా
సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్ మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి, ఎస్ఆర్ఎస్పి (SRSP) కాలువల ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన ధర్నా నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు, రైతులు ఈ ఆందోళన చేపట్టారు.
ఎండిపోతున్న పంటలు.. పట్టించుకోని ప్రభుత్వం
ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి మండల పార్టీ నాయకులు మాట్లాడుతూ.. తీవ్రమైన వేసవి ఎండల కారణంగా నియోజకవర్గంలో సాగు నీరు అందక రైతుల పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి వద్ద మోటార్లను వెంటనే ప్రారంభించి, కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు గోదావరి నీటిని అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే నీటిని విడుదల చేయకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, రైతులు.
ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో నూతనకల్ మండల పార్టీ అధ్యక్షులు మున్న మల్లయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్, మాజీ పీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న గౌడ్, మాజీ సర్పంచ్ల ఫోరం చైర్మన్ సూడి లింగారెడ్డిలు ముందుండి నడిపించారు. వారితో పాటు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, నాయకులు మహేశ్వర, మల్లికార్జున, గాడిదల లింగరాజు, మాదాసు వెంకన్న, కాస నరేందర్, చురుకంటి మధుసూదన్ రెడ్డి, జటంగి సరిత, కృష్ణ, కోటేష్ నాయక్, బికుమల్ల మాజీ సర్పంచ్ కప్పల రామ్మూర్తి గౌడ్, మండల నాయకులు రేసు వెంకటేశ్వర్లు, బత్తుల విజయకుమార్ పాల్గొన్నారు. వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, మండల యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్మికులతో పాటు పెద్ద సంఖ్యలో కర్షకులు (రైతులు) తరలివచ్చి ఈ ధర్నాకు పూర్తి మద్దతు ప్రకటించారు.




