Suryapet: భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో యువత ఉద్యమించాలి: పీవైఎల్ నేతలు

Suryapet: డిసెంబర్ 21, 22 తేదీలలో సూర్యాపేటలో పీవైఎల్ రాష్ట్ర 9వ మహాసభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మోకాళ్ళ రమేష్, కోల లక్ష్మీనారాయణ తెలిపారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 24 Nov 2026 1:41 PM IST
Suryapet
X

Suryapet: భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో యువత ఉద్యమించాలి: పీవైఎల్ నేతలు

సూర్యాపేట: ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) తెలంగాణ రాష్ట్ర 9వ మహాసభలను డిసెంబర్ 21, 22 తేదీలలో సూర్యాపేట పట్టణంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మోకాళ్ళ రమేష్, కోల లక్ష్మీనారాయణ తెలిపారు.సూర్యాపేట పట్టణంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో యువత ఉద్యమించాలనే నినాదంతో ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

దేశంలో రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న యువత తమ హక్కుల కోసం పోరాడాలన్నారు. దేశంలో కొనసాగుతున్న మతోన్మాదం, అణచివేత, అక్రమ నిర్బంధాలు, రోజురోజుకు పెరిగిపోతున్న నిరుద్యోగం, మత్తు పదార్థాలు, గంజాయి వంటి సమస్యలపై మహాసభల్లో సమగ్రంగా చర్చిస్తామన్నారు.యువశక్తిని కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. పేపర్ లీకేజీలు, ఉద్యోగాల కోసం నిరీక్షణ, నిరుద్యోగుల ఆత్మహత్యలు, అవినీతి, అక్రమాలు వంటి అంశాలపై యువత ప్రశ్నించాలన్నారు.

విద్య, వైద్యం ప్రైవేటీకరణ, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వాలను నిలదీయడానికి ఈ మహాసభలను వేదికగా చేసుకుంటామన్నారు.మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సూర్యాపేట జిల్లా, పట్టణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు సహకరించి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో పివైఎల్ రాష్ట్ర కోశాధికారి ధరావత్ రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.వి. చారి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య, రాష్ట్ర, జిల్లా నాయకులు బండి రవి, పోలేబోయిన కిరణ్, గిరిబాబు, దండి ప్రవీణ్, పి. సురేష్, డి. ప్రవీణ్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA