Suryapet: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ తేజస్
Suryapet: సూర్యాపేట కలెక్టరేట్లో ప్రజావాణికి 101 అర్జీలు రాగా, దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.
Suryapet: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ తేజస్
సూర్యాపేట జిల్లా: ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి సోమవారం జరుగు ప్రజావాణి కి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మరియు మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ప్రతి అధికారి తమ లాగిన్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని లేనియెడల వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మండల స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల స్థాయి సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి, రెవిన్యూ కి సంబందించి 53 దరఖాస్తులు, డిపిఓ 5, డి డబ్ల్యు ఓ 5, డిఇఓ 5, పి డి హౌజింగ్ 5, మిగిలిన 28 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 101 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, డిఎంహెచ్వో వెంకటరమణ, సిపిఓ కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి ఉపేందర్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి , జిల్లా అధికారులు తదితరులు హాజరైనారు




