Suryapet: సూర్యాపేటలో స్వచ్ఛంద బంద్, భారీ నిరసన ర్యాలీ!

Suryapet: సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్.. స్వచ్ఛంద బంద్, భారీ ర్యాలీ నిర్వహణ.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 18 Sept 2026 1:39 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో స్వచ్ఛంద బంద్, భారీ నిరసన ర్యాలీ!

Suryapet: సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్, రైల్వే కారిడార్ ఏర్పాటు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి అఖిలపక్ష నేతలు, వ్యాపారస్తులు, వివిధ రంగాల ప్రజలు భారీగా తరలివచ్చారు. పట్టణంలో స్వచ్ఛంద బంద్ పాటించి ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం గతంలో ప్రకటించిన పాత అలైన్‌మెంట్ ప్రకారమే బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అలైన్‌మెంట్ వల్ల తెలంగాణకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ నుండి బుల్లెట్ ట్రైన్ మార్గం ప్రతిపాదించడం ఎవరి కోసమని ప్రశ్నించారు.

చౌటుప్పల్, సూర్యాపేట, కోదాడ మీదుగా రైలు మార్గం ఉంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. జనం లేని మార్గంలో సీఎం కొనుక్కున్న 3 వేల ఎకరాల కోసం రైల్వే లైన్ తీసుకెళ్లడం ఆయనతో పాటు ఆంధ్రాకు లాభం చేయడమేనని విమర్శించారు.

సకల జనుల ఆకాంక్ష మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత అలైన్‌మెంట్‌ను యథాతథంగా కొనసాగించాలని కోరారు. NH-65 హైదరాబాద్ - విజయవాడ రహదారికి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ కేటాయించే వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని రంగాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి ర్యాలీలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. సూర్యాపేట ప్రజల ఆకాంక్ష మేరకు స్థానిక శాసనసభ్యునిగా జేఏసీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో తన వంతు మద్దతు ఉంటుందని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA