Suryapet: ఉక్కు మహిళ ఇందిరమ్మకు ఘన నివాళి: సర్వోత్తమ్ రెడ్డి
Suryapet: సూర్యాపేటలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
Suryapet: ఉక్కు మహిళ ఇందిరమ్మకు ఘన నివాళి: సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట: దేశ సమగ్రత, సమైక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత నాయకురాలు ఇందిరాగాంధీ అని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.
భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, దేశ సమగ్రత, సార్వభౌమత్వం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యశాలి ఇందిరాగాంధీ అని కొనియాడారు. పాకిస్థాన్‌తో యుద్ధంలో చారిత్రాత్మక నాయకత్వాన్ని ప్రదర్శించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కీలక పాత్ర పోషించారన్నారు.
మహిళా శక్తికి, ఆత్మవిశ్వాసానికి, ధైర్యసాహసాలకు ఇందిరాగాంధీ మార్గదర్శిగా నిలిచారన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, చట్టాలను తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేశారని గుర్తుచేశారు.
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేస్తోందని, గతంలో ఇందిరాగాంధీ పేరుతో ప్రారంభించిన అనేక పథకాలు పేదల అభ్యున్నతికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఇందిరాగాంధీ, గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలు, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.




